ఆనాటి కర్ణ దుర్యోధనుల నుంచి ఈ నాటి బరాక్ ఒబామా జో బైడెన్‌ల దాకా మనుషలని నడిపే హెమోగ్లోబిన్ రహిత పవిత్ర పటుత్వ ఫెవికాల్ బంధం స్నేహం. అమ్మా నాన్నలకి తప్పదు, కన్నారు కాబట్టి. అన్నదమ్ములకి, అప్పచెల్లెళ్లకి తప్పదు కలిసిబుట్టారు కాబట్టి. చిటికెలో తెంచుకోగలిగి, తుంచుకోక ఎన్నో తుఫానులు తట్టుకు నిలబడే అజరామర బంధం, స్నేహం.
![]() |
నేను కాలేజీకి వెళ్లడం మొదలెట్టి ఒక నెల రోజులయ్యాక ముందు వరస మూల సీటులో మూలా నక్షత్రంలో పుట్టిన మలప త్రాష్టుడొకడు మోటు బఱ్ఱె గొంతేసుకుని ఓండ్ర పెడుతూ కనిపించాడు. ఎవడ్రా ఈ జఫ్ఫాగాడు మనిషి చూస్తే బ్రాడ్ పిట్లా ఉన్నాడు స్వరం వింటే వేలంపాట వరహాల రావులా ఉంది అనుకున్నా. సర్లే వీడితో మనకేమి పని ముందు బెంచి మాంగోమాన్ గాడు మనలాంటి బ్యాక్ బెంచ్ బాట్‌మాన్‌తో ఏమి పనిలే అని మిన్నకున్నాను. మా ఇంటికి సగం దూరం వరకు సైకిల్ తొక్కే సింగినాధం గాడు ఒకడు పరిచయం అయ్యాడు వాడి పేరు రిజిష్టరుడు. వాడి గురించి వాడి పేరు గురించి ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాం. దానికి ఇంకొక బ్లాగు కావాలి. నాకు చాలా ఓపిక కావాలి. ప్రస్తుతం సమయం, సహనం రిజర్వు లో నడుస్తున్నాయి గనుక ఇవాళ్టికి మా మూలా నక్షత్రం గాడి గురించి మాట్లాడుకుందాం.
రక్తి రస చిత్రాలు రోజూ నాలుగాటలు ప్రదర్శించే వెంకటేశ్వర థియేటర్ ముందు వంకాయ బజ్జీలు మహత్తరంగా వేసే వరలక్మి గారి బజ్జీ దుకాణం ముందు మా మొదటి పరిచయం. వాడు పొడుగ్గా ఉంటాడు నేను పొడుగ్గా ఉంటాను అది కాకుండా మా ఇద్దరి మధ్య కుదిరిన కామన్ పాయింట్ రిజిస్టాగాడు. ఆ వంకాయ బజ్జీలు చట్నీలో ముంచుతూ మా రిజిస్టా గాన్ని కాకిలా పొడుస్తూ ఒక విధమైన గూఢానందం పొందేవాళ్ళం.
ఎవరికీ కనిపించని గొప్పదనమేదో మా మూలా నక్షత్రం గాడికి నాలో కనిపించేది. క్లాసులు ఎగ్గొట్టి కాంటీన్లు బట్టుకు తిరిగేవాడు ఎదో సాధిస్తాడని నమ్మేవాడెవడు ? వాడు. వాడు నమ్మాడు. వాడికి నా మీద ఉన్న నమ్మకం, నా మీద నాకు నమ్మకం పెంచింది. గాలి తిరుగుళ్ళు మీంచి దృష్టి జీవితం మీదకి మళ్లింది. చదువు మీద మళ్ళీ శ్రద్ధ కుదిరింది. వీడు రిక్షా తొక్కుతాడా, మూటలు మోస్తాడా ? మూటలు మోస్తే బాగుణ్ణు రిక్షా అయితే రిస్క్ ఎక్కువ అనుకునే మా ఇంట్లో వాళ్ళ ఆలోచనలను హమ్మయ్య వీడు మంచి దారిలో పడ్డాడు అనుకునేలా చేసాడు. వాడి సహచర్యం మా కెమిస్ట్రీ లెక్చరర్ సుబ్బా రావు గారి ప్రోత్సాహంతో బి.ఏ ఫస్టు క్లాసులో పాసయ్యా.
అలా మూడు బజ్జీలు, ఆరు పునుగులు చందంగా మా డిగ్రీ పూర్తయ్యింది. ఎం.బీ. బీ. ఎస్ ఎంట్రెన్సు కోసం పగలనక రాత్రనక కష్టపడి చదివి వాడు లక్షో ర్యాంకు, నేను లక్షా పది వేల ర్యాంకు తెచ్చుకున్నాం. నాకన్నా పది వేల ర్యాంకు తక్కువొచ్చింది కాబట్టి వాడికి నా కన్నా ముందర సీటొచ్చింది. నా కౌన్సిలింగ్ వాడి కౌన్సిలింగ్ అయిన రెండు రోజుల తరువాత అయినా నా కోసం డెట్రాయిట్లో ఉంటున్న వాడు వాషింగ్టన్ కి నా కౌన్సిలింగ్ కోసం వచ్చాడు. మా వాడు వస్తున్నాడు సీట్ ఉంచండి అని వెర్రి వాడిలా కాలేజీ వాళ్ళ చుట్టూ కాలు కాలిన కోతిలా తిరిగాడు. ఎం.బీ. బీ. ఎస్ ఎంట్రన్స్ లో నాదే చివరి ర్యాంకు గనుక రాత్రి కొట్టు కట్టేసి నిమ్మకాయ పిండేసి గుమ్మడి కాయ నేలకేసి కొట్టే టైంకి, ఇక వీడిని పిలవకపోతే వాడు ఏడుస్తాడు, వీడు నీరసిస్తాడు అని గ్రహించి నాకు కూడా మా వాడి క్లాసులో ఒక నీల్ కమల్ కుర్చీ కట్టబెట్టారు. నాకు సీటు దొరికితే వాడు సింహాసనం మీద కూర్చున్నట్టు ఉబ్బి తబ్బిబయ్యాడు.
ఆంగ్ల పరీక్ష తరువాత వచ్చే లెక్కల పరీక్ష ల, దారపుండలో చిక్కులా , కమ్మటి కాఫీ తాగుతుంటే మూతి కాల్చే మీగడలా ప్రేమ గుండంలో పడ్డాడు కీటకంలా, మా మూలా నక్షత్రంగాడు. వీడి పిచ్చి పాడుగాను వాడు ప్రేమలో పడి నేను ఖాళీగా ఉంటె నాకు బోరు కొడుతుందనుకున్నాడో ఏమో! నాకు ఒక ప్రేమ సంబంధం చూసి పెట్టాడు. ఒరేయ్, ఆ కాజల్ అగర్వాల్ నీకు మంచి జోడి, మీ ఇద్దరి పెయిర్ బాగుంటుంది అని మా ప్రేమ సెట్టిల్ చేసాడు. వాడు మాత్రం స్నేహమో, ప్రేమో తేల్చుకోలేని త్రిశంకు స్వర్గంలో వేలాడుతున్నాడు. ఈ లోపు మా అందరి డాక్టర్ కోర్సులు పూర్తయ్యాయి. నేను వాడు మా మిగతా స్నేహితులందరం న్యూ యార్క్‌లో ఒక రూము తీసుకున్నాం. కేర్ హాస్పిటల్లో అర్జున్ రెడ్డి ఉద్యోగం వచ్చింది వాడికి. ఒక రోజు నాకు వాడికి చిన్న గొడవయ్యింది, మేము ఇద్దరం మాట్లాడుకుని నెల రోజులయ్యింది. ఈ నెల రోజుల్లో వాడు కుంగిపోవడం గమనించాను.
ఒక రోజు మధ్యాహ్నం సడన్‌గా రేయ్, పార్క్‌కి వెళదాం రా అన్నాడు. సరే పద, అని ఇద్దరం వెళ్లి పార్కులో కూర్చున్నాం. ఇద్దరి మధ్య ఒక అరగంట మాటల్లేవు. వాడు గట్టిగా పీలుస్తున్న గాలి, పార్కులో కూస్తున్న పక్షుల కూతలు తప్ప ఇంకేమి వినబడటం లేదు. నేను ఏదో ఆలోచిస్తూ అలా తదేకంగా శూన్యంలోకి చూస్తున్నాను ఇంతలో నా భుజం తడిసినట్టు అనిపించింది. ఉలిక్కి పడి చూస్తే వాడు నా భుజం మీద తల పెట్టి వల వల ఏడుస్తున్నాడు. రేయ్ ఏమయ్యింది. ఏంట్రా ఇది ? నిన్న తనకి నా ప్రేమ గురించి చెప్పాను రా. నా ప్రేమ కథ ఇంకెప్పటికీ నా ఒక్కడిదే రా అని కూలిపోయాడు.
నా కోసం వాడు అంత చేస్తే వాడి ఒక్క రోజు కోపం నేను అర్ధం చేసుకోలేక పోయాను. నాకు తల కొట్టేసినట్టు అయ్యింది. వాడ్ని ఓదార్చడం నేను చేసుకున్న పాప ప్రక్షాళనం. వాడు ఆ బాధ నుంచి తేరుకోవడానికి చాలా రోజులే బట్టింది. వాడి పెళ్ళికి కూడా ఇంకొన్ని రోజులు పట్టేలా ఉంది. మీరందరూ గట్టిగా కోరుకోండి అయిపోతుందేమో ఎవరన్నా తగిన హీరోయిన్‌తో త్వరలో.
మాటిచ్చాను మరి ఏ మూలన ఉన్నా వస్తాను అని మూలా నక్షత్రం గాడి పెళ్ళికి.


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి