చేరావా, ఇంకా దారిలోనే ఉన్నావా ? అమరపురి చేరడానికి పది రోజుల సమయం పడుతుందిట కదా. అయినా నీ కోసం పంపిన ప్రత్యేక విమానం తొందరగానే తీసుకువెళ్తుందిలే. నీ కోసం మాకు తెలిసిన మూడు లోకాలు, మాకు తెలియని మూడు కోట్ల దేవతలు ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటారు. చాలా గట్టి ప్రయత్నమే చేశాం బాలూ. కానీ దేవ, మానవ సంగ్రామంలో దేవతలే నెగ్గారు. పట్టు పట్టి వాళ్ళ పంతం నెగ్గించుకున్నారు. మేము మహంకాళమ్మ దగ్గర నుంచి మహాదేవుడి దాకా పెట్టని అర్జీ లేదు, మొక్కని మొక్కు లేదు. పాపం వాళ్ళకి ఈ సారి దేవతల మాట మన్నించక తప్పినట్టు లేదు. గడువు పూర్తి కాక ముందే నిన్ను రప్పించుకుంటున్నారు. నువ్వు పరమేశ్వరుడిని నీ పాటతో పులకింప చేసినపుడు, ఆ తిరుపతి వెంకన్న ముందు తియ్యగా పాడినపుడు, నిన్ను శతాయుష్మాన్ భవ అని దీవించకుండా ఉండి ఉంటారా ? మరి వంద పూర్తవడానికి ఇంకో పాతికేళ్ళు మిగిలే ఉన్నాయి కదా. ఇచ్చిన ఆశీర్వచనం నిలబెట్టుకోవాలి కదా. మాట ఎందుకు తప్పారో మేమందరం అడిగామని కడిగిపారేయ్ బాలూ. అయినా, సిరివెన్నెల సీతారాముడన్నట్టు, తేనెలొలికే పూలబాలలకు మూణ్ణాళ్ళ ఆయువిచ్చినవాడినేది కోరేది, బండరాళ్ళను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చినవాడినేది అడిగేది ?
సరే, నీకు ప్రయాణం విసుగు పుట్టింస్తుందేమో అని కాసేపు మన జ్ఞాపకాలు నెమరువేస్తున్నా.
మా అమ్మ పొత్తిళ్ళలో మొదలైంది మన పరిచయం. భారతంలో అభిమన్యుడు సుభద్రా దేవి కడుపులోంచి పద్మ వ్యూహం విన్నట్టు నేను నీ పాటలే విన్నానుట. మా నాన్నతో నీకు బాగా స్నేహం, నీ పాటలే పాడేవాడు లేదా వినిపించేవాడు.
అమ్మ కౌగిల్లో నాన్న ఒళ్ళో, నా ఆట నీ పాట గుర్తున్నాయా బాలూ? అమ్మ నిద్రపుచ్చటానికి వటపత్ర శాయికి అని సుశీలమ్మలానే పాడేది. ఎప్పుడన్నా పడుకోకుండా మారాం చేస్తూ ఉంటె అమ్మ బూచాడు వస్తాడని భయపెట్టేది, ఇంకా వినకపోతే ఒక గదుము గదిమేది. నేను ఏడుస్తుంటే నాన్న చిన్నారి పొన్నారి కిట్టయ్య అని పాడేవాడు. స్వాతిముత్యాలతో ఆడుకున్న బాల్యం మనది బాలూ.
శెలవులకని బాబాయ్ పిన్ని వాళ్ళంటికి వెళ్తే ఆ కోకిల, గీతాంజలి క్యాసెట్టు అరిగిపోవాల్సిందే. గీతాంజలి అనగానే ఎందుకా చిలిపి నవ్వు ? అవును, ఆ ఒక్క పాట రాగానే పక్క గదిలోకి వెళ్లిపోయేవాణ్ణి పిచ్చి పిచ్చి భూత మంత్రాలు పాడితే భయం వెయ్యదా ?
మనం చిన్నప్పుడు ఆడుకున్న దొంగాట గుర్తుందా నీకు ? అదే కోండ-వీటి దొంగ ఆట. నేను ముఖానికి రుమాలు కట్టుకుని, సైకిల్ తొక్కుతుంటే నువ్వు వెనక క్యారేజ్ మీద కూర్చుని జీవితమే ఒక ఆట సాహసమే పూబాట అని పాడుతుంటే నేను ఊగి పోతూ ఆ అద్దె సైకిల్ని అరవై మైళ్ళ వేగంతో తొక్కేవాణ్ణి. వీధి కుక్కలు వెంట పడితే భయమేసినా, చిరంజీవి గుర్రం వెనక పరిగెత్తే కుక్కలా ఊహించుకుని మురిసిపోయేవాణ్ణి.
రాజా రాజాధి రాజా అని, జగడ జగడం అని మనం ఊగిపోయిన రోజులు. ఆమని పాడవే హాయిగా అని సేద తీరిన రోజులు. మనసు విరుపులలో ప్రేమ మాధుర్యం గురించి ప్రియురాలి కాఠిన్యం కన్నీళ్లు తెప్పించిన రోజులు. మనసుకి సంబంధించిన ప్రతి స్పందనలో నీ పాటలతో అనుబంధం. వెండి వెన్నెల, చల్లటి గాలి, నీ పాట. దేవుడు ఎంత దయామయుడు అనిపించేది. మేలిపొద్దున లేచి ఈటీవీలో కన్నీటి ఊట రాకుండా పొడగంటిమయ్యా నిన్ను పురుషోత్తమ విన్న అనుభవం ఒక్క సారి కూడా లేదు. ఆదర బాదరగా పనులన్నీ చక్కపెట్టుకుని టీవీ ముందు వాలిపోయే నాన్న ఉత్సాహం, పడకుర్చీ మీద ఆయన వాయించే పక్క వాయిద్యం. రోజూ పనులతో సతమతమయ్యే ఆయన పట్టలేని ఆనందంతో ఉండే రోజు, పాడుతా తీయగా ప్రసారమయ్యే రోజు. ఆ గంట సేపు ఎంత హాయిగా గడిచిపోయేదో.
ప్రేమ ప్రేమా అని నీ వయసులో సగం కూడా లేని కుర్రాళ్ళకి నువ్వు పాడితే ప్రకృతి మొత్తం ప్రేమ గుభాళింపులే. నా యవ్వనమంతా నువ్వు కురిపించిన మనసు, ప్రేమల వర్షం. ఆ పాటలు నేను పాడినా ఎంతో అందంగా ఉండేవి. ఎందుకంటే నేను పాడుతుంటే వినపడేది నా గొంతు కాదు, నీ గొంతు. చెవుల మధ్య నీ స్వరం శాశ్వతంగా నిలిచిపోయి అరె, నేను కూడా బాలూలానే పాడుతున్నానే అనుకునేలా చేసేది. అంతలా మస్తిష్క తంత్రుల్లో మమేకం అయిపొయింది నీ పాట.
అప్పుడప్పుడూ జడి వానలా కురిసే కన్నీళ్లు నువ్వు వెళ్లినప్పటి నుంచి సముద్రపు కెరటాలల వచ్చిపోతున్నాయి బాలూ. నువ్వు అక్కడికి చేరి నీ కుశల సమాచారం తెలిపేంత వరకు ఇంతే అనుకుంటా. నువ్వు వెళ్లిపోయావ్ అనే బాధ లేదు. నువ్వు ఇక ప్రత్యక్షంగా కనపడవు, వినపడవు అనే దిగులు తప్ప. నువ్వు అక్కడ సుఖంగా ఉంటావ్, సముచితంగా గౌరవించబడతావ్ అని ఆనందంగా ఉన్నా. నీకు నేను చెప్పాల్సిన నెనరు, చేయాల్సిన ఋక్కులు బోల్డు బాకీపడిపోయానేమో అని బాధగా ఉంది. నీ గానం నా ప్రాణం, ప్రాణము నీవని గానము నీదని, గానమే ప్రాణమని అని ఆ పెద్దాయన చెప్పాక గానాన్ని ప్రాణాన్ని ఎలా విడదీస్తారు బాలూ.
నువ్వు త్వరగా వెళ్లిపోయావ్ అని నేను బాధపడుతున్నానే గానీ, డెబ్బైనాలుగేళ్లకే ఎన్నో వేల జీవితాలు జీవించావ్, మరెన్నో జీవితాలు నిలబెట్టావ్. నీ జీవితం, నీ అంత నీ నవ్వంత నిండైనది బాలూ.
నాకు ఈ మధ్య అనిపించింది. అదేదో సినిమాలో శాపగ్రస్థులైన దేవతలు భూమి మీద మానవులుగా పుట్టినట్టు, నీకు ఏదో శాపం అనుకుంటా ఒక వందేళ్లు భూమి మీద జీవించి, భూలోకాన్ని రంజింప చేయాలని. నీ సత్ప్రవర్తన, వినయ విధేయతలు చూసి నీ శిక్షా కాలం తగ్గించారేమో బహుశా.
సరే, క్షేమంగా వెళ్ళు, మళ్ళీ రావద్దులే అక్కడే సుఖంగా ఉండు. నీ లాంటి వాళ్ళ దర్శనం ఎన్నో పుణ్యకార్యాలు చేస్తే గానీ దక్కకూడదులే.
తెలుగు పాట అనగానే మదిని తొలిచే నీ జ్ఞాపకం.
నేను అడగకుండా నువ్వు నేర్పిన పాఠం.
నేను కోరకుండా దక్కిన నీ స్నేహం.
నేను కొలవని దైవం.
నువ్వు
సర్వేజనా సుజనోభవంతు, సర్వే సుజనా సుఖినోభవంతు.
శెలవు బాలు

చాలా చాలా బాగుంది సాయి గారు
రిప్లయితొలగించండిధన్యవాదాలండి 🙏🏼
తొలగించండి\
🙏
రిప్లయితొలగించండి