కన్నీళ్లు కళ్ళకి మంచివి. కడిగేస్తాయి. కళ్ళని, మనసులోని బాధల్ని.
గీతా ప్రకాష్, జెస్సి కార్తిక్, గీతా రాజా రేంజ్ ప్రేమ కథ ఒకటి చెప్పాలని నా కోరిక. అంత తెలివి, క్రియేటివిటీ నాకు లేవు గనుక మా అమ్మా నాన్నల ప్రేమ కథ చెబుతాను వినండి. మణిరత్నం గీతాంజలి, శేఖర్ కమ్ముల ఫిదాలా ఉండే స్టోరీ కాదు కానీ చాలా రొటీన్ కథ. పెళ్లిళ్ల పేరయ్య , అటు పెద్ద వాళ్ళు , ఇటు పెద్ద వాళ్ళు , మావిడాకులు, కొబ్బరి కాయలు, తాటాకు పందిళ్లు, విడిదిల్లు, పెళ్లి బస్సులు, చిన్న కార్లు, పూల దండలు, పన్నీరు బుడ్డీలు, షామియానాలు, పెట్రో మాక్స్ లైట్ల కింద అరిటాకు భోజనాలు. హబుల్ టెలీస్కోప్ వేసి వెతికినా కనిపించిన అనుష్కా శెట్టి నక్షత్రం.
పెళ్ళిలో వాళ్ళిద్దరి మధ్య తీసిన తెరసాల, వాళ్ళ లవ్ ఎట్ ఫస్ట్ సైట్.
ఆ మొదటి చూపులో ప్రేమ దిన దిన ప్రవర్ధమానమై నాకు తలుచుకోవడానికి బోలెడు జ్ఞాపకాలు ఇచ్చింది. అమ్మంటే నాన్నకు ప్రాణం, నాన్నే అమ్మ లోకం. అసలు ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమని ఎలా చూపిస్తారు ? ఒక తడి ముద్దు, ఒక వెచ్చని కౌగిలి పోనీ ఓ ఖరీదైన కానుక ? నాకు మా అమ్మ ప్రేమ, నాన్నకు ఇచ్చిన కాఫీలో, అది తన్మయత్వంతో తాగుతుంటే తన ముసి ముసి నవ్వులలో, నాన్న అడిగిందే తడవుగా చేసే పిండి వంటల్లో ఆయన ఆఫీసు నుంచి ఖాళీ చేసి తీసుకువచ్చే కారేజీలో కనిపించేది. మరి నాన్న ? చెప్పానుగా ఈయన మీద కొంచెం సినిమా ప్రభావం ఎక్కువ. అమ్మ మీద డ్యూయెట్లు , ప్రేమ డైలాగులు. అరగంట పట్టే ఆఫీస్ దూరాన్ని, ఆ ర్యాలీ సైకిల్ని ఒక పోలార్ సాటిలైట్ లాంచ్ వెహికల్ని జేసి, ఇరవై నిమిషాలలో ఇంటికి జేరి అమ్మ ఒడిలో వాలిపోయినప్పుడు కనిపించేది.
టీవీలు విలాస వస్తువులైన కాలం, స్మార్ట్ ఫోన్ల ఊహే లేని యుగమో ఏమో రిమోట్ బటన్లు, టచ్ స్క్రీన్లకి బదులు అమ్మ, నాన్న కాళ్ళు ఒత్తేది. నాన్న శిర పౌరసత్వం అమ్మ ఒడిలో లేదా అమ్మ కాలక్షేపం నాన్న పాదాలతో, రెంటిలో ఎదో ఒకటి మాత్రం ఖరారుగా ఉండేది నేను ఆటల్లో అలసి ఇంటికి జేరేసరికి. ఇద్దరి స్థిర నివాసం ఉభయుల డెందములలో. ఏయ్ రాయుడు ఏంటి ఆ గ్రాంధీకం ? అనకండి, ఇక చెప్పబోయేది వినండి. మరి ఇంత అందమైన వేడుక పండాలంటే వెనక మంచి సంగీతం ఉండాలి కదా. నిన్న కనిపించింది, నన్ను మురిపించింది అంద చందాల రాణి ఆ చిన్నది అని రాణి రత్న ప్రభ సినిమాలోని పాట, మా నేషనల్ పానాసోనిక్ టేపు రికార్డర్లోని టీ.డీ.కె క్యాసెట్ పాడుతూ ఉండేది. ఆ పాట ఏ ఎత్తుగడలో మొదలవుతుందో ఆ దృశ్యం కూడా అలాగే ఉండేది. ఆ పాటలో మా నాన్న ఎన్టీఆర్ అయితే మా అమ్మ అంజలి దేవి.
మరి నేనెవర ? రేలంగి. వాళ్ళ ప్రేమ పానకంలో పుడకని. మా అమ్మ కమ్మగా వండే అన్నపూర్ణ అయితే, నిత్య సంగీత శ్రవణంలో ఓలలాడే విశ్వేశ్వరుడు మా నాన్న. ఇప్పుడు ఉన్న సినిమా డేటా బేస్ ఐ.ఎం.డి.బి లాగ నాన్న టీ.ఎం.డి.బి తెలుగు మ్యూజిక్ డేటా బేస్. రేడియోలో వచ్చే ఏ పాట ఏ సినిమాలోదో, దాని సంగీత దర్శకుడు ఎవరు, వాద్యకారులు ఎవరు అన్న మొత్తం సమాచారం ఉండేది నాన్న దగ్గర. అది ఆయన మాకు సాయంకాలం సెకండ్ కప్ కాఫీ తాగుతూ పంచిన జ్ఞానం.ఆ పాటలు మా అమ్మ నాన్న ప్రేమతో పెనవేసుకు పోయాయ్, నా గుండెల్లో నిలిచిపోయాయ్. ఆ పాత తెలుగు పాటలు నాలో చెరగని మా నాన్న జ్ఞాపకం మా అమ్మ చిరునగవుల పునః దర్శనం.
వాళ్ళు రాసుకునే ఎచ్చాల లిస్టులు, వేసుకునే బతుకు లెక్కలు, డిటెక్టివ్ నవలల కోసం లైబ్రరీకి వాళ్ళ సాయంకాలం నడకలు అన్ని ముద్దుగా అనిపించేవి, అందంగా కనిపించేవి. లైబ్రరీ నుంచి తెచ్చిన పుస్తకాలన్నీ నాన్న చదివి అమ్మకి విశదీకరించేవాడు. అవేవో సంస్కృత పుస్తకాలు అనుకునేరు మధు బాబు షాడో, జ్యోతి చిత్ర, సితార మునుపు జెప్పినట్టు. మా అమ్మకి ఏ మాత్రం ఆసక్తి ఉండేదో తెలియదు కానీ అన్నిటికి ఊ కొట్టేది. అమ్మని నాన్న ఏమోయ్ అని లేకపోతే వినిపించిన, కనిపించిన, గుర్తొచ్చిన సెలబ్రిటీ పేరుతో పిలిచేవాడు. అమ్మ పేరు ఒక రోజు విజయదుర్గ ( దూరదర్శన్ తెలుగు న్యూస్ రీడర్ ) ఇంకో రోజు శోభారాణి, అప్పుడప్పుడు జయంతి, నిర్మలమ్మ, కన్నాంబ కూడా అయ్యేది, కాదు మా నాన్న చేసేవాడు. అమ్మకి చిర్రెత్తుకొచ్చి అపర కాళీ అయితే నాన్న పాహి పాహి అని పాటలు పాడి ప్రసన్నం చేసుకునేవాడు. నాన్న పాటలు అమ్మ, కూని రాగాలు. వంటింట్లో అమ్మ వంటల ఘుమ ఘుమలు, హాల్లో నాన్న పడక కుర్చీ మీద సంగీత కచేరీలు అలా హాయిగా, మా మేడ మీద పూచిన సన్న జాజి పూలతో, మా అమ్మ అల్లిన పూలదండల అందంగా సాగిపోతోంది వాళ్ళ కాపురం.
ఒక రోజు అమ్మకి ఒంట్లో నలతగా ఉంది అంటే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లారు. డాక్టర్ గారు ఏవో టెస్టులు జేశారు. రిపోర్టులు వచ్చాక తెలిసింది అమ్మ గుండెకి గాయమయ్యింది. నాన్న… మనసుకి. డాక్టరు గారు పెద్దగా కంగారు పడాల్సింది ఏమి లేదు ఆపరేషన్ చేస్తే తగ్గిపోతుంది అన్నారు. ఆపరేషన్ జరిగిన కొన్ని నెలలకి తన ఆరోగ్యం సరిగా లేకపోతే వేరే పెద్ద స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్లారు ఆయన అన్ని పరిశీలించి ఆ ఆపరేషన్ సరిగా జరగలేదు అని నాన్నకి ఇంక అమ్మ లాక్కురాగాల సమయం అని మూడు వేళ్ళు తెరిచి చూపించారు. మూడేళ్లు... మా అమ్మ గుండె దుర్బలమేమో గాని తన మనో స్థైర్యం చాలా గొప్పది.
చాలా డాక్టర్లని కలిశారు, చాలా వైద్యాలు చేయించారు. నువ్వు నాతో ఇంకొన్నాళ్ళుంటే బాగుంటుందన్న నాన్న వాంఛ, నాన్న తో ఇంకా కలిసి బతకాలన్న అమ్మ కాంక్ష కొండెక్కిన దీపపు ఒత్తిని పైకి నెట్టిన ప్రయాసలు. రాను రాను అమ్మ ఆరోగ్యం బాగా క్షీణించింది, ఇంట్లో అన్ని పనులు చక చక చక్కబెట్టే అమ్మ తన పనులు తాను చేసుకోలేక ఇబ్బంది పడింది. స్నానాల గదికి వెళ్లాలన్నా నాన్న ఎత్తుకుని తీసుకువెళ్ళేవాడు. అమ్మ మంచం మీద పడుకుంటే నాన్న మంచం పక్కన నేల మీద పడుకునేవాడు హాస్పిటల్లో. ఒక తెల్లవారు ఝామున నాన్న మంచి నిద్రలో ఉన్నాడని గమనించి, తనే ఆప సోపాలు పడుతూ బాత్రూంకి వెళ్ళింది. తిరిగి రావడానికి ఓపిక చాలక పాపం నేల మీద పాక్కుంటూ వచ్చి నాన్న పక్కన పడుకుని ఆయనని గట్టిగా పెనవేసుకు నిద్రపోయింది. శాశ్వతంగా.
అమ్మ గాఢ నిద్ర చెట్టంత మా నాన్నకి నిద్ర లేకుండా చేసింది. తను గతించిన పదో రోజు, అమ్మ తల ఒత్తక పోయేసరికి అనుకుంటా నాన్నకి తలనొప్పి మొదలయ్యింది. ఒక నెలకి అది ట్యూమర్ అయ్యింది. మీ అమ్మ లాగ నిన్ను వదిలేసి వెళ్ళను నాన్న అన్న మా నాన్న అమ్మని వదిలి ఉండలేకపోయాడు. గడప దగ్గర నుంచొని ఏమోయ్ వస్తున్నావా అని పిలిచే మా నాన్న ఏవండీ వస్తున్నారా అన్న పిలుపు విని నిలవలేకపోయాడు. సాయంత్రం లైబ్రరీకి వెళ్లినట్టు ఇద్దరూ మరో పెళ్లి పుస్తకం కోసం బయలుదేరారు. నాకు జన్మనిచ్చిన జంట. నాకు ప్రేమ నేర్పిన జంట. కష్టంలో, సుఖంలో, ఆరోగ్యంలో, అనారోగ్యంలో చివరికి చావులో కూడా నిన్ను విడువను అని పెళ్లి నాటి ప్రమాణాలు నూటికి నూట పది శాతం బతికి చూపిన జంట. నా కన్నుల పంట.
ఇది మా అమ్మా నాన్నల ప్రేమ కీర్తన. ఇది వాళ్ళకి నా ఆరాధన.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి