ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

అరంగేట్రం

ఈ బ్లాగులోని పాత్రలు, సన్నివేశాలు యదార్ధ కల్పితాలు మాత్రమే. ఎవరో ఒకరిని ఉద్దేశించినవి కావచ్చు కాకపోవచ్చు.

పొగ తాగడం, మద్యం సేవించడం, వేగంగా బండి నడపడం, నోటికొచ్చిందల్లా వాగడం ఆరోగ్యానికి హానికరం.

- ప్రార్ధన -

హమ్మయ్య పూజ అయిపోయింది. ఇంక మొదలెడదాం.

నా పేరు కూతల రాయుడు. ఇంట్లో వాళ్ళు , పక్కింటి వాళ్ళు, వీధి చివర బామ్మ గారు ముద్దుగా రాయుడు అని పిలుచుకుంటారు. కమీయ కబెల్లో, షాన్ మెండెసల జ్యేష్ట సంతానం నేను(పేర్లు మార్చబడినవి). అందరి కుటుంబాలలో ఉన్నట్టే మా ఇంట్లో కూడా కష్టం సుఖం. కాకపోతే, అవును వీళ్ళిద్దరూ కొంచెం ఎక్కువ కష్ట పడ్డారు అని నా ఫీలింగ్. ఒక చేత్తో ఓం పెట్టి ఇంకొక చేత్తో కళ్ళలో గ్లిసరిన్ కొట్టడం సరి కాదనిపించింది ఈసారికి. ఆ ట్రాజెడీలు ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాం.

మా అమ్మ అల్ రౌండర్, పాటలు, కుట్లు అల్లికలు, మా డొక్కు ప్రేస్టిజ్ ప్రెషర్ కుక్కర్లో కేకులు అబ్బో ఆవిడకి రాని విద్య అంటూ లేదు. ప్రతి దాంట్లో పర్ఫెక్షన్ వెతికేది. మాటలు ముత్యాలు, రాతలు రత్నాలు. మొత్తం అర డజను సంతానంలో మా అమ్మ పెద్ద కూతురు. దాంతో చిన్నపటి నుంచి తాను పెంచిన వాళ్లే గాని తనను పెంచిన వాళ్ళు ఎవరు లేరు. తనకి తెలిసిన పదవి అమ్మ ఒక్కటే. అందుకే అనుకుంటా ఎంత కష్టం వచ్చిన నిబ్బరంగా నిలబడేది.

మా నాన్న సత్పురుషుడు. సినిమా పిచ్చోడు. మధు బాబు డిటెక్టివ్ నవలలు చదువుతూ డిగ్రీ పూర్తి చేసిన ఘనుడు. సితార, జ్యోతి చిత్రల నిత్య పరాయణుడు( రామ రామ హీరోయిన్లు కాదు సినిమా పత్రికలు ), భోజన ప్రియుడు, ఏ ఊళ్ళో ఏ హోటల్లో ఏమి బాగుంటుందో ఇట్టే చెప్పెయ్యగల దేహమున్న జొమాటో. హాస్యాన్వేషి, జంధ్యాలగారి వీర భక్తి బృందంలో ఒకడు. సంగీతాభిలాషి. మొత్తం అర డజను సంతానంలో మొదటి వాడు ( కాపీ పేస్ట్ కాదు నిజంగానే ).

మా తమ్ముడు “లోకి”, రామ లక్ష్మణులు అనే కన్నా , రావణ, విభీషణులు అంటే కరెక్టేమో. వాడి కన్నా కొన్ని సంవత్సరాలు ముందు పుట్టడం వల్ల నాకు కొన్ని స్పెషల్ ప్రివిలేజెస్ దక్కాయి. కొంచెం అబ్యూస్ అఫ్ పవర్ చేసే వాణ్ని. చెప్పాను కదా వాడు విభీషణుడు ఏమి అనే వాడు కాదు.

ఇప్పుడు మా ఫ్యామిలీలో ఒక ముఖ్య సభ్యున్ని పరిచయంజేస్తాను.

అంతర్జాలం నుంచి ఎత్తి వేయబడినది.

మా రాజదూత గాడు.

చూసారా ఎలా మెరిసిపోతున్నాడో!!, ఆదివారం రాగానే మా అమ్మ మా ఇద్దరికీ తలంటితే మా నాన్న ఈడికి తలంటే వాడు. సర్ఫులు, స్పాంజులు అబ్బో ఈడి అభ్యంగన స్నానం ఒక ఈవెంటు. పెట్రోలు పానకం తాగినట్టు తాగేవాడు తాగుబోతు వెధవ.లీటరు కి 20 కిలోమీటర్లకు మించి పరిగెత్తడు ఆంబోతు వెధవ.

అంత ప్రేమగా చూసుకున్నందుకు అలాగే గొడ్డు చాకిరి చేసే వాడు లెండి. మొత్తం కుటుంబం అంతా ఈ పుష్పకం విమానం మీద సైదాబాద్ నుంచి మౌలాలి దాకా హోమియో మందు తెచ్చుకోడానికి వెళ్ళేవాళ్ళం. నన్ను ఆ వెనక ఇనప కమ్మి మీద ఒక దిండు వేసి కూర్చోబెట్టే వాళ్ళు. కొంచెం ఇబ్బంది, భయంగా ఉన్నా , గాల్లో తేలినట్టుందే గుండె లాగినట్టుందే లానే ఉండేది.

హైదరాబాదు, బెజవాడ, తిరుపతి, మంగళగిరి మమ్మల్ని ఆపని ట్రాఫిక్ కానిస్టేబుల్ లేడు. నేను ఈడు నాన్న బాగా ఎంజాయ్ చేసిన రైడ్ అంటే బెజవాడ మంగళగిరి రైడ్ అనే చెప్పాలి. అలా స్కూల్ నుంచి రాగానే తాడేపల్లి, ప్రకాశం బారేజి మీదుగా రయ్యంటూ బెజవాడ పోతుంటే, ఆ కృష్ణ నది గాలి మోహన ముద్దులెడుతుంటే అదొ థ్రిల్లు. వన్ టౌను, టూ టౌను, సత్యనారాయణపురం, బందరు రోడ్డు స్వగృహ ఫుడ్స్ అన్ని ఈడి మీదే.

మా నాన్నకు ఈ బండి అంటే ఇష్టం, మా అమ్మని కూర్చో బెట్టుకుని నడపడం అంటే ప్రాణం. టూత్ పేస్టు, సర్ఫు, సబ్బు బిళ్ళ ఏదైనా కలిసే తిరిగేవాళ్లు. నాన్న ఒక్కడే సరుకులు తేవడం నేను చూసింది చాలా తక్కువ. అందుకే అనుకుంటా జీవితపు అతి పెద్ద ప్రయాణం కూడా ఇద్దరు కలిసేజేశారు. రాజదూతు గాడిని ఇంట్లో పెట్టేసి, నన్ను తమ్ముణ్ణి వదిలేసి.

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శెలవు బాలు

బాలూ, చేరావా , ఇంకా దారిలోనే ఉన్నావా ?  అమరపురి  చేరడానికి పది రోజుల సమయం పడుతుందిట కదా . అయినా నీ కోసం పంపిన ప్రత్యేక విమానం తొందరగానే తీసుకువెళ్తుందిలే . నీ కోసం మాకు తెలిసిన మూడు లోకాలు , మాకు  తెలియని మూడు కోట్ల దేవతలు ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటారు . చాలా గట్టి ప్రయత్నమే చేశాం బాలూ . కానీ దేవ , మానవ సంగ్రామంలో దేవతలే నెగ్గారు . పట్టు పట్టి వాళ్ళ పంతం నెగ్గించుకున్నారు .   మేము మహంకాళమ్మ దగ్గర నుంచి మహాదేవుడి దాకా పెట్టని అర్జీ లేదు , మొక్కని మొక్కు లేదు . పాపం వాళ్ళకి ఈ సారి దేవతల మాట మన్నించక తప్పినట్టు లేదు . గడువు పూర్తి కాక ముందే నిన్ను రప్పించుకుంటున్నారు . నువ్వు పరమేశ్వరుడిని నీ పాటతో పులకింప చేసినపుడు , ఆ తిరుపతి వెంకన్న ముందు తియ్యగా పాడినపుడు , నిన్ను శతాయుష్మాన్ భవ అని దీవించకుండా ఉండి ఉంటారా ? మరి వంద పూర్తవడానికి ఇంకో పాతికేళ్ళు మిగిలే ఉన్నాయి కదా . ఇచ్చిన ఆశీర్వచనం నిలబెట్టుకోవాలి కదా .   మాట ఎందుకు తప్పారో మేమందరం అడిగామని కడిగిపారేయ్ బాలూ . అయినా , సి...